Pakistan: భారత భూభాగాలతో కొత్త మ్యాప్... మొన్న నేపాల్ చేసిన పనే ఇప్పుడు పాకిస్థాన్ చేసింది!
- లడఖ్, గుజరాత్ ప్రాంతాలతో పాక్ నూతన మ్యాప్
- ఇది చారిత్రక దినం అని పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్
- దేశ ప్రజల మనోభావాలకు తగిన మ్యాప్ అంటూ వ్యాఖ్యలు
ఇటీవలే నేపాల్ భారత్ లోని కొన్ని భూభాగాలను తన ప్రాంతాలుగా చూపిస్తూ అధికారిక మ్యాప్ రూపొందించడం తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ కూడా సరిగ్గా అదే పని చేసింది. లడఖ్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలను తనవిగా పేర్కొంటూ ఓ మ్యాప్ విడుదల చేసింది. ఈ పొలిటికల్ మ్యాప్ లో లడఖ్ లోని కొంతభాగంతోపాటు గుజరాత్ లోని సర్ క్రీక్, జునాగఢ్, మన్వదార్ ప్రాంతాలను పొందుపరిచింది.
ఈ మ్యాప్ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ప్రవచనాలు వినిపించారు. ఇది పాక్ ప్రజల మనోభావాలకు అద్దం పడుతోందన్నారు. ఈ మ్యాప్ కు కేబినెట్ ఆమోదం లభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఇవాళ చిరస్మరణీయ దినం అని పేర్కొన్నారు.
"ఇవాళ పాక్ కొత్త మ్యాప్ ను ప్రపంచం ముందుంచుతున్నాం. ఈ మ్యాప్ యావత్ దేశ ప్రజల ఆకాంక్షలకే కాదు, కశ్మీర్ ప్రజల ఆశయాలకు కూడా అనుగుణంగా ఉంది. కశ్మీర్ కు సంబంధించి గతేడాది ఆగస్టు 5న భారత్ ప్రభుత్వం తీసుకున్న అక్రమ చర్యకు ఈ మ్యాప్ తగిన సమాధానం చెబుతుంది. ఇకనుంచి ఇదే పాకిస్థాన్ అధికారిక మ్యాప్ అవుతుంది" అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్టు 5న భారత ప్రభుత్వం కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ఎత్తివేయడం తెలిసిందే.