Kerala: ఇది రూ.100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్: కేరళ పోలీసులు
- కలకలం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్
- 200 కిలోల బంగారాన్ని ఇండియాకు తెచ్చారు
- నిందితులకు పెద్దలతో పరిచయాలున్నాయి
- బెయిల్ ఇవ్వరాదని వాదనలు వినిపించిన పోలీసులు
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ లో నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వరాదని కేరళ పోలీసులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పోలీసుల తరఫు న్యాయవాది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది రూ. 100 కోట్ల విలువైన కుంభకోణమని, మొత్తం దాదాపు 200 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి ఇండియాకు రాయబార కార్యాలయాల పలుకుబడిని ఉపయోగించి తెచ్చారని, ఈ విషయంలో ఎన్ఐఏ ఆధారాలు సంపాదించిందని తెలిపారు. ఈ కేసు విచారణలో ద్వైపాక్షిక విధానాలను అనుసరించామని, నవంబర్ 2019 నుంచి జనవరి 2020 మధ్య కేవలం మూడు నెలల కాలంలోనే 20 సార్లు బంగారాన్ని దేశంలోకి అక్రమంగా తీసుకుని వచ్చారని పేర్కొంది.
ప్రధాన నిందితులైన స్వప్నా సురేశ్, సరిత్ తదితరులు ఉద్దేశపూర్వకంగానే నేరాలకు పాల్పడ్డారని, వారు యూఏఈ కాన్సులేట్ లో పనిచేస్తూ, తమ అధికారాలను దుర్వినియోగం చేశారని కోర్టుకు తెలిపారు. జూన్ 2019లో ద్వైపాక్షిక మార్గాల ద్వారా సులువుగా బంగారాన్ని స్మగ్లింగ్ చేయవచ్చని వీరు గుర్తించారని, ఆపై తమ పని ప్రారంభించారని, కాన్సులేట్ నుంచి స్వప్నను తొలగించిన తరువాత ఆమె ఇదే పనిలో నిమగ్నమైందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. యూఏఈ కాన్సులేట్ లో పనిచేస్తున్న విదేశీ అధికారుల పేరిట వీటిని తెప్పించారని, వీరికి బెయిల్ మంజూరు చేయరాదని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే 8,034 యూఎస్ డాలర్లు, 701.5 ఒమన్ రియాల్స్, రూ. 51 లక్షల ఫిక్సెడ్ డిపాజిట్ బాండ్లను, స్వప్నా సురేశ్ నుంచి ఎన్ఐఏ స్వాధీనం చేసుకుందని, ఆమె బ్యాంకు లాకర్ నుంచి కోటి రూపాయలతో పాటు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, వీటన్నింటి విలువ దాదాపు రూ. 2 కోట్లని తేలిందని, ఈ పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ ఇస్తే, కేసును తప్పుదారి పట్టిస్తారని వాదనలు వినిపించారు. వీరికి సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని కోరగా, కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది.