Mukesh Ambani: తదుపరి 15 సంవత్సరాల కోసం ముఖేశ్ అంబానీ లక్షల కోట్ల ప్లాన్!

Mukesh Ambani Multi Billion Crores Plan for Future

  • భవిష్యత్తు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైనే
  • అక్టోబర్ లో భారీ ప్రణాళికను వెల్లడించనున్న ముఖేశ్ అంబానీ
  • రిన్యూవబుల్ ఎనర్జీపైనే ప్రధానంగా దృష్టి

ప్రపంచ భవిష్యత్తు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైనే ఆధారపడి ఉంటుందన్న గట్టి నమ్మకంతో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, లక్షల కోట్ల పెట్టుబడులతో, దీర్ఘకాల ప్రణాళికను రూపొందిస్తున్నారని, ఇందుకు సంబంధించిన వివరాలను అక్టోబర్ లో వెల్లడిస్తారని తెలుస్తోంది.

హైడ్రోజన్ ఇంధనంతో పాటు, పవన, సౌర విద్యుత్, మరింత శక్తిమంతమైన బ్యాటరీల తయారీపై దృష్టిని సారించిన ఆయన, వచ్చే పదిహేనేళ్ల సంస్థ ప్రయాణాన్ని ఆ దిశగా సాగించనున్నారని సమాచారం. 2035 నాటికి ప్రపంచ ఇంధన సంస్థల్లో రిలయన్స్ ను తొలి స్థానంలో ఉంచే లక్ష్యంతో ఆయన ప్లాన్ సాగుతుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.

ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి, రిలయన్స్ పెట్టే పెట్టుబడులను, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా అక్టోబర్ లో ముఖేశ్ స్వయంగా వెల్లడిస్తారని ఆయన తెలిపారు. ఈ విభాగంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడమే ఆయన లక్ష్యమని తెలిపారు. కాగా, గత నెలలో జరిగిన సమావేశంలో తమ సంస్థ దీర్ఘకాల వ్యూహంతో ముందుకు సాగుతుందని సూచన ప్రాయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ముడి చమురుపై మాత్రమే తాము ఆధార పడదలచుకోలేదని, అంతకు మించి ఎంతో చేయనున్నామని తెలిపారు.

ప్రపంచ పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్న వేళ, రిన్యూవబుల్ ఎనర్జీకి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో అత్యధిక కాలుష్య కారకమైన థర్మల్ పవర్ 64 శాతం ఉండగా, ప్రత్యామ్నాయ ఇంధన వాటా 22 శాతం మాత్రమే. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిపై దృష్టిని సారించింది. డిసెంబర్ 2019 నాటికి ఇండియాలో 86 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం ఉండగా, డిసెంబర్ 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్ల లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది. ఈ విషయంలో అందివచ్చే అవకాశాలను వ్యాపార వృద్ధికి బాటలుగా చేసుకునేందుకు ముఖేశ్ ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News