Amrutha: ‘మర్డర్’ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణకు నోటీసులు జారీ చేసిన నల్గొండ జిల్లా సివిల్ కోర్టు
- సినిమా చిత్రీకరణను నిలిపివేయించమని గత నెల 29న కోర్టును ఆశ్రయించిన అమృత
- కేసు విచారణలో ఉండగానే సినిమా విడుదలైతే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడుతుందన్న పిటిషనర్
- ప్రతివాదులకు నోటీసులు పంపి, కేసును రేపటికి వాయిదా వేసిన కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ఆధారంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘మర్డర్’ సినిమా చిత్రీకరణను ఆపాలంటూ ప్రణయ్ భార్య అమృత గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో సివిల్ దావా వేశారు. కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కాబట్టి, ఇలాంటి సమయంలో కల్పిత కథతో ఉన్న ఈ సినిమా విడుదలైతే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని, కాబట్టి సినిమా చిత్రీకరణను ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అమృత ఆ పిటిషన్‌లో కోరారు.
అమృత దాఖలు చేసిన సివిల్ దావాను విచారించిన కోర్టు ప్రతివాదులైన దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణకు అత్యవసర నోటీసులు జారీ చేస్తూ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదులకు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా నిన్న నోటీసులు జారీ చేసినట్టు అమృత తరపు న్యాయవాది తెలిపారు.