Sushant Singh Rajput: అదేమైనా నేరమా?.. స్వప్రయోజనాల కోసమే సుశాంత్ మృతిని రాజకీయం చేస్తున్నారు: ఆదిత్య థాకరే

Aditya Thackeray Reaction on Sushant singh Rajputh death
  • సుశాంత్ సింగ్ మృతికి కారణమైన వారికి అండగా ఉన్నారని ఆరోపణలు
  • ప్రభుత్వ విజయాలు చూసి ఓర్వలేకేనన్న ఆదిత్య థాకరే
  • రాష్ట్రానికి, థాకరే కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు చేయబోనన్న మంత్రి
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే స్పందించారు. సుశాంత్ మృతికి కారణమైన వారికి ఆయన అండగా ఉన్నారని, ఈ కేసు నుంచి వారిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తనపై వస్తున్న ఈ ఆరోపణలకు మంత్రి స్పందించారు. కావాలనే కొందరు పనిగట్టుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు చూసి ఓర్వలేక కొందరు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వప్రయోజనాల కోసం సుశాంత్ మృతిని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇది తగదని హితవు పలికారు.

తాను హిందువుల హృదయ సామ్రాట్ అయిన బాలాసాహెబ్ థాకరే మనవడినని, మహారాష్ట్రకు కానీ, శివసేనకు కానీ, థాకరే కుటుంబ ప్రతిష్ఠకు గానీ భంగం కలిగించే పనులను ఎప్పటికీ చేయబోనని ఆదిత్య థాకరే స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీ ముంబైలో ఒక భాగమని అన్నారు. సినీ ప్రముఖులతో స్నేహం ఉండడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. కరోనా వైరస్‌పై పోరాడుతున్న ప్రభుత్వం సానుకూల ఫలితాలు సాధిస్తుండడంతో ఓర్వలేకే సుశాంత్ కేసును రాజకీయ చేస్తున్నారని ఆదిత్యథాకరే మండిపడ్డారు.
Sushant Singh Rajput
Aditya Thackery
Mumbai
Uddhav Thackeray

More Telugu News