CPI Narayana: రాజధానిపై హైకోర్టు స్పందన హర్షణీయం: సీపీఐ, సీపీఎం
- సొంత రాజకీయాల కోసమే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన
- జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారు
- సీఎం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా?
సొంత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు విమర్శించారు. అమరావతినే రాజధానిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు వామపక్షాల మద్దతు ఉంటుందని చెప్పారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులను పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతిని రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా కరోనాతో ఇబ్బంది పడుతుంటే... ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.