Ravishankar Prasad: రాజ్యాంగంలోని సీతారాముల ఫొటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి
- రాజ్యాంగం ఒరిజినల్ ప్రతిలో సీతారాముడు, లక్ష్మణుడి ఫొటో
- ప్రాథమిక హక్కుల చాప్టర్ ప్రారంభంలో ఫొటో ఉందన్న రవిశంకర్ ప్రసాద్
- అందరితో పంచుకోవాలనిపించిందన్న కేంద్ర మంత్రి
అయోధ్య రామమందిర నిర్మాణానికి ఈరోజు భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ప్రత్యేకమైన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. రాజ్యాంగంలోని సీతారాముల ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. 'రాజ్యాంగం ఒరిజినల్ ప్రతిలో రావణుడిని చంపిన తర్వాత అయోధ్యకు తిరిగి వస్తున్న రాముడు, సీత, లక్ష్మణుడి అందమైన చిత్రం ఉంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన చాప్టర్ ప్రారంభంలో ఈ చిత్రం ఉంది. ఈ అందమైన చిత్రాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది' అని రవిశంకర్ ట్వీట్ చేశారు.
మరోవైపు రవిశంకర్ ప్రసాద్ కు శ్రీరాముడి న్యాయవాదిగా పేరుంది. అలబాద్ హైకోర్టులో రామజన్మభూమి వివాదం కేసులో ఆయన శ్రీరాముడి తరపున వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో శ్రీరాముడి తరపున ప్రముఖ లాయర్ పరాశరన్ వాదించారు.