Raghuram Rajan: మరోసారి మారటోరియం పొడిగింపుపై భారత్ ను హెచ్చరిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తావించిన రఘురామ్ రాజన్!

Rajan Warns India Over Extened of Maratorium

  • మారటోరియాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
  • అన్ని రంగాల్లోనూ డిమాండ్ ఉంటుందన్న రాజన్
  • ఈఎంఐలు చెల్లించవద్దంటే ప్రజలు దానికే అలవాటుపడతారు
  • తిరిగి డబ్బు కట్టించాలంటే చాలా కష్టమవుతుంది
  • ప్రైవేటు బ్యాంకుల కన్నా, ప్రభుత్వ బ్యాంకులకే అధిక నష్టం
  • ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ చీఫ్ రఘురామ్ రాజన్

నెలవారీ కిస్తీల చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించిన మారటోరియాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ మారటోరియాన్ని మరింతకాలం పాటు పొడిగిస్తే, గతంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా కనిపిస్తాయని హెచ్చరించారు. నేటి నుంచి ఆర్బీఐ పరపతి సమీక్ష జరుగనున్న నేపథ్యంలో, ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, పలు విషయాలను చర్చించారు.

"ఒకసారి ప్రజలను మీరు ఈఎంఐలను చెల్లించవద్దని చెబితే, వారిని తిరిగి చెల్లింపులకు అలవాటు చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే, ప్రజల్లో డబ్బు దాచుకునే అలవాటు పోతుంది. కట్టేందుకు వారి వద్ద డబ్బులు ఉండవు.. ఏదో ఒక దశలో మారటోరియం ముగియాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో సూక్ష్మ రుణ సంస్థల కష్టాలు గుర్తున్నాయా? ఒకసారి ప్రజలను చెల్లింపులు చేయవద్దని చెబితే, వారు దానికే అలవాటు పడిపోతారు. అదే జరిగితే నిరర్థక ఆస్తులు పెరిగిపోతాయి. ఆపై మైక్రోఫైనాన్స్ సంస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఎంతకాలం మారటోరియం పొడిగింపు అమలవుతుందో, బ్యాంకులకు రుణాల వసూలు అంత క్లిష్టతరమవుతుంది" అన్నారు.

కాగా, తొలుత మార్చిలో మూడు నెలలు, ఆపై మేలో మరో మూడు నెలల కాలం పాటు మారటోరియాన్ని పొడిగిస్తూ, ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆరు నెలల వ్యవధి ఈ నెలాఖరుతో ముగియనుండగా, మరోమారు పొడిగిస్తారని వార్తలు వస్తున్నాయి. మారటోరియం పొడిగింపుతో ప్రైవేటు బ్యాంకుల కన్నా, ప్రభుత్వ రంగ బ్యాంకులే అధికంగా నష్టపోతాయని రాజన్ హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ఎంతో మేలు చేశాయనడంలో సందేహం లేదని, అయితే, ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

కరోనా కష్టకాలం ప్రజల వినియోగ అలవాట్లను మార్చి వేసిందని, భారత ప్రభుత్వం వైరస్ వ్యాక్సిన్ కోసం వేచి చూడకుండా, మహమ్మారిని నియంత్రించే మార్గాలను అన్వేషించాలని సూచించిన రాజన్, వచ్చే సంవత్సరం వరకూ ఇండియాలో వైరస్ విస్తరణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పారు. వెంటనే అన్ని రంగాలనూ లాక్ డౌన్ నుంచి మినహాయించాలని, అప్పుడు మాత్రమే ప్రజలందరికీ ఉపాధి లభిస్తుందని, ఆ తరువాతే వినిమయ విభాగం బలోపేతం అవుతుందని రాజన్ అభిప్రాయపడ్డారు. కరోనాకు టీకా సైతం వచ్చే సంవత్సరం తొలి లేదా రెండో త్రైమాసికం వరకూ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని అన్నారు.

ఇండియాలో వినియోగ డిమాండ్ లేదని భావించడం తగదని, అన్ని రంగాల్లోనూ డిమాండ్ ఉంటుందని, అయితే, అది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తుందని వ్యాఖ్యానించిన ఆయన, ఉత్పత్తి జరుగకుంటే, మూలధనం అవసరం ఉండదని, ఓ సంస్థ ఏ వస్తువునూ విక్రయించకుంటే, ఆ వస్తువుకు డిమాండ్ లేనట్టుగా భావించరాదని అన్నారు. ఎంఎస్ఎంఈ (సూక్ష్మ,చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు)లకు రుణాలను అందిస్తే, అవి తీసుకుంటాయని, అయితే, ఈ సంస్థలు పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ, తీసుకున్న రుణాన్ని సక్రమంగా వెచ్చించబోవని, దీంతో రుణాల ఉద్దేశం వ్యర్థమైపోతుందని రాజన్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News