GC Murmu: జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము రాజీనామా.. మనోజ్ సిన్హా నియామకం!
- కాగ్ బాధ్యతలు ముర్ముకు అప్పగించే అవకాశం
- రేపటిలోగా నిర్ణయం తీసుకోనున్న కేంద్రం
- ముర్ము 1985 బ్యాచ్ గుజరాత్ ఐఏఎస్ అధికారి
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము తన పదవికి రాజీనామా చేశారు. దీనిని రాష్ట్రపతి ఆమోదించినట్టు ప్రకటన వెలువడింది. ఇక ఆ రాష్ట్రానికి ఆయన స్థానంలో కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమించినట్టు రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తుడిగా పేరున్న ముర్ము, మోదీ గుజరాత్ కు సీఎంగా పనిచేస్తున్న వేళ, ఆ రాష్ట్రంలోనే పనిచేశారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారని వార్తలు వస్తున్న వేళ, ముర్ము రాజీనామా చేశారని జమ్మూ కశ్మీర్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 8వ తేదీతో కాగ్ హెడ్ రాజీవ్ మెహర్షి పదవీ కాలం ముగియనుండగా, ఇప్పటికే ముర్ముకు ఆ పదవి ఖాయమై పోయిందని సమాచారం. రాజ్యాంగ బద్ధమైన కాగ్ అధినేత పదవి ఖాళీగా ఉండడానికి నిబంధనలు అనుమతించవు కాబట్టే, కేంద్ర పెద్దల ఆదేశాలతో ముర్ము రాజీనామా చేశారని తెలుస్తోంది.
1985 బ్యాచ్ గుజరాత్ ఐఏఎస్ అధికారి అయిన జీసీ ముర్ము, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, తొలుత ఆర్థిక మంత్రిత్వ శాఖలో విధులను నిర్వర్తించారు. ఆపై వ్యయ విభాగం సంయుక్త కార్యదర్శిగానూ కీలక బాధ్యతలు నిర్వహించారు. గత సంవత్సరం నవంబర్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి వుండగా, అంతకు కొద్ది రోజుల ముందే జమ్మూ కశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించబడ్డారు.