Temple: పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జగన్ కు గుడి!
- రాజుపాలెం గ్రామంలో జగన్ కు ఆలయం
- శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
- ఇతర రాష్ట్రాల్లోనూ జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని కితాబు
దేవుళ్లకు గుడి కట్టడం సాధారణమైన విషయం. సినీ తారలకూ కొన్నిచోట్ల ఆలయాలు నిర్మితమవుతున్నాయి. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు కూడా గుడి కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం నిర్మిస్తున్నారు. ఈ గుడిలో సీఎం జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. భూమి పూజ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ సీఎం జగన్ ను ఆకాశానికెత్తేశారు.
దేశంలోనే కరోనా చర్యల్లో ఏపీ అగ్రగామిగా ఉందని కీర్తించారు. జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను ఇతర రాష్ట్రాల నేతలు కొనియాడుతున్నారని వెల్లడించారు. కరోనా అడ్డంకులు సృష్టిస్తున్నా, సీఎం జగన్ వెనుకంజ వేయకుండా కృషి చేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారని కితాబునిచ్చారు. కాగా, ఈ ఆలయాన్ని స్థానిక వైసీపీ నేత కురుకూరి నాగేశ్వరరావు కుటుంబం నిర్మిస్తోంది.