Sanchaita: ప్రజాసేవకుడిగా అశోక్ గజపతి చేసింది ఏమీలేదని చివరికి వెల్లడైంది: సంచయిత
- విజయసాయిరెడ్డి వాస్తవాలు వెల్లడించారన్న సంచయిత
- అశోక్ గజపతి ట్రాక్ రికార్డు జీరో అంటూ వ్యాఖ్యలు
- విజయనగరాన్ని 'విద్యానగరం'గా తీర్చిదిద్దుతానని ఉద్ఘాటన
ఇటీవలే సింహాచలం దేవస్థానం ట్రస్టు చైర్ పర్సన్ గా బాధ్యతలు అందుకున్న సంచయిత గజపతి తాజాగా తన బాబాయి అశోక్ గజపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రజాసేవకుడిగా అశోక్ గజపతికి సంబంధించిన ట్రాక్ రికార్డు వెల్లడైందని, విజయనగరం అభివృద్ధి కోసం ఆయన చేసింది శూన్యమేనని తేలిందని పేర్కొన్నారు. దీనిపై వాస్తవాలు వెల్లడించిన ఎంపీ విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు.
అయితే, మహారాజా విజయరామ గజపతి రాజు (ఎంవీజీఆర్) విద్యాసంస్థల చైర్ పర్సన్ గా విజయనగరాన్ని 'విద్యా నగరం'గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తన తాతగారైన పీవీజీ రాజు స్వప్నాన్ని తాను సాకారం చేస్తానని సంచయిత ఉద్ఘాటించారు. అంతేకాకుండా, సింహాద్రి అప్పన్న దేవస్థానం చైర్ పర్సన్ గా పుణ్యక్షేత్రానికి పూర్వవైభవం తీసుకురావడంలో కృషి చేస్తానని తెలిపారు.