Supreme Court: సుప్రీంకోర్టులో మాల్యా కేసుకు సంబంధించిన పత్రాలు మాయం!
- అప్పట్లో మాల్యాపై కోర్టు ధిక్కార కేసు నమోదు
- కేసుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన మాల్యా
- ఆ పిటిషన్ ఇప్పటివరకు ఎందుకు నమోదు చేయలేదన్న సుప్రీం కోర్టు
దేశంలో భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని లండన్ పారిపోయిన విజయ్ మాల్యాని తిరిగి రప్పించేందుకు మార్గం సుగమం అవుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ మాల్యా కేసుకు సంబంధించిన కీలక పత్రాలు సుప్రీం కోర్టులో కనిపించకుండా పోయాయి. ఎంతో ముఖ్యమైన పత్రాలు మాయం కావడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన సంతానానికి 40 మిలియన్ డాలర్లను బదిలీ చేసే అంశంలో కోర్టు ఉత్తర్వులను అతిక్రమించారంటూ అప్పట్లో మాల్యాపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. 2017లో ఈ కేసుపై రివ్యూను కోరుతూ మాల్యా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టగా, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ కనిపించలేదని అధికారులు చెప్పారు. దాంతో సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తికి గురైంది.
మూడేళ్ల కిందట మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను కోర్టులో ఇప్పటివరకు ఎందుకు రిజిస్టర్ చేయలేదో చెప్పాలని అధికారులను ఆదేశించింది. మాల్యా రివ్యూ పిటిషన్ ఫైల్ ను ఏ అధికారులు పరిశీలించారో వారి పేర్లతో సహా పూర్తి వివరాలు తమకు సమర్పించాలని జస్టిస్ లలిత్, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.