Sri Lanka: శ్రీలంకలో ఘన విజయం దిశగా రాజపక్స సోదరులు!
- 22 జిల్లాల్లో 17 చోట్ల ఎస్ఎల్పీపీ ముందంజ
- తమిళుల ఓట్లున్న చోట కూడా విజయం
- ఫోన్ చేసి అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ
శ్రీలంకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని అయిన మహింద రాజపక్స ఘన విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఆయన నేతృత్వంలోని ఎస్ఎల్పీపీ (శ్రీలంక పొదుజన పెరుమణ పార్టీ) అధ్యక్ష ఎన్నికల్లో, ఇప్పటివరకూ ఫలితాలు వెలువడిన 16 సీట్లలో 13 చోట్ల 60 శాతానికి పైగా ఓట్లను సాధించి దూసుకెళుతోంది. తమిళులు అధికంగా ఉన్న ఉత్తర లంక ప్రాంతంలోనూ ఆయన నిలిపిన అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారు. మొత్తం 225 సీట్లున్న అసెంబ్లీలో 22 జిల్లాలకుగాను 17 చోట్ల ఎస్ఎల్పీపీ అభ్యర్థులు ఇప్పటికే ఆధిక్యం దిశగా సాగుతున్నారు.
ఫలితాల సరళి వెలువడిన వెంటనే ఎస్ఎల్పీపీ పార్టీ కేంద్రాల వద్ద సంబరాలు మొదలయ్యాయి. ఇది అధికార పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకమని మహింద రాజపక్స సోదరుడు, ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స వ్యాఖ్యానించారు. ఆయన గెలుపు ఖాయమైన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, స్వయంగా ఫోన్ చేసి శుభాభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక బంధాలను పెంచుకునేందుకు ఈ ఫలితాలు సహకరిస్తాయని ఆయన అన్నారు. రెండు దేశాలూ ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకుని, ముందుకు సాగాలని అభివర్ణించారు.
నరేంద్ర మోదీ ఫోన్ తరువాత ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన మహింద రాజపక్స, శ్రీలంక, భారత్ ప్రజలు స్నేహితులు, బంధువులని వ్యాఖ్యానించారు. ఇండియాతో తమ బంధం యుగాల నుంచి కొనసాగుతున్నదేనని అన్నారు.