Srisailam: ఆల్మట్టికి మొదలైన భారీ ఇన్ ఫ్లో... గంటల్లో లక్ష క్యూసెక్కులు దాటిన వరద!
- ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాలకు భారీ వరద
- ముందు జాగ్రత్తగా నీటిని వదులుతున్న అధికారులు
- వారం రోజుల్లో నిండిపోనున్న శ్రీశైలం
ముందుగా ఊహించినట్టుగానే కృష్ణానదిలో భారీ వరద ప్రారంభమైంది. ఎగువ కర్ణాటకలోని పలు ప్రాంతాలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి రిజర్వాయర్ కు వస్తున్న వరద నీరు గంటల వ్యవధిలోనే వేల క్యూసెక్కుల నుంచి లక్షల క్యూసెక్కులకు పెరిగింది. నిన్న రాత్రికి రిజర్వాయర్ కు 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, అది మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ముందు జాగ్రత్తగా, 70 వేల క్యూసెక్కులను కిందకు వదులుతుండగా, అది నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలానికి వస్తోంది.
ఆల్మట్టి నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు కాగా, ఇప్పటికే 100 టీఎంసీలకు పైగా నీరు ఉంది. శనివారం నాటికి రిజర్వాయర్ పూర్తిగా నిండుతుందని, ఆపై వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతామని వెల్లడించారు. ఇక ఇదే సమయంలో తుంగభద్రలో దాదాపు 70 వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. దాదాపు 100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న తుంగభద్రలో ప్రస్తుతం 42 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, వస్తున్న వరద లెక్కల ప్రకారం నాలుగు రోజుల్లోనే రిజర్వాయర్ నిండుతుంది. వరద పెరిగితే, మరింత త్వరగా జలాశయం నిండుకుండలా మారుతుంది.
దీంతో తుంగభద్ర నుంచి కూడా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిన నేపథ్యంలో వరద నీరంతా శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్ కు చేరనుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 77 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, అధికారుల అంచనా ప్రకారం, వచ్చే వారం రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది.