Glenmark: డోస్ పెంచిన గ్లెన్ మార్క్.. ఫావిపిరవిర్ 400 ఎంజీ మాత్రల విడుదల!
- ఇప్పటివరకూ 200 ఎంజీ టాబ్లెట్లు మాత్రమే
- 400 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేసిన సంస్థ
- తొలి రోజున 9 మాత్రలు చాలని వెల్లడి
భారత్ లో తొలిసారిగా కరోనా డ్రగ్ ఫావిపిరవిర్ ను విడుదల చేసిన గ్లెన్ మార్క్ ఫార్మాస్యుటికల్స్, ఇప్పుడు దాని డోసేజ్ స్థాయిని పెంచింది. ఇప్పటివరకూ 200 ఎంజీ డోస్ లో 'ఫాబిఫ్లూ' టాబ్లెట్లను విడుదల చేసిన సంస్థ, దాని డోసేజ్ ని 400 ఎంజీకి పెంచింది. దీంతో పదుల కొద్దీ మాత్రలను వేసుకోవాల్సిన అవసరం తప్పినట్లవుతుందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ వచ్చిన తొలి రోజున 18 టాబ్లెట్లు, ఆపై రోజుకు 8 టాబ్లెట్లను వేసుకోవాల్సి వచ్చేది. 400 ఎంజీ టాబ్లెట్లు అందుబాటులోకి రావడంతో, తొలి రోజున 9 మాత్రలు వేసుకుంటే సరిపోతుందని, ఆపై ఐదారు రోజుల పాటు రోజుకు 4 టాబ్లెట్లు తీసుకోవాల్సి వుంటుందని సంస్థ తెలిపింది. కాగా, ఇండియాలో ఫావిపిరవిర్ 400 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేసేందుకు అనుమతి పొందిన తొలి సంస్థ గ్లెన్ మార్క్ కావడం గమనార్హం.