Kadapa Police: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ సహా 31 మందిపై కేసు నమోదు చేసిన కడప పోలీసులు
- నిన్న కడప జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రిలీజ్
- జైలు వద్దకు భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు
- కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు
కడప జైలు నుంచి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. వీరి విడుదల సందర్భంగా కడప జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కడప జైలు వద్ద కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, జేసీ పవన్ సహా 31 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు.
కొవిడ్ నియమావళిని ఏమాత్రం పట్టించుకోలేదన్న కారణంతో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. నిన్న జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి అంతలోనే మరో వివాదంలో చిక్కుకున్నారు. కడప నుంచి ఆయన తాడిపత్రికి చేరుకునే క్రమంలో భారీ కాన్వాయ్ తరలి వచ్చింది. దీనిపై తాడిపత్రి సీఐ దేవేందర్ అభ్యంతరం వ్యక్తం చేయగా, జేసీ ఆయనపైకి దూసుకెళ్లడం మీడియాలో కనిపించింది. ఈ అంశంలోనూ జేసీపై కేసు నమోదైంది.