JC Prabhakar Reddy: విడుదలై 24 గంటలు గడవకముందే... జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్
- నిన్ననే కడప జైలు నుంచి విడుదలైన ప్రభాకర్ రెడ్డి
- కాన్వాయ్ ఆపిన సీఐతో వాగ్యుద్ధం
- తాడిపత్రిలో జేసీపై అట్రాసిటీ కేసు నమోదు
- డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు
నెలరోజులకు పైగా జైలులో గడిపి నిన్ననే కడప కారాగారం నుంచి విడుదలైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను తాజాగా అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేశారు. కడప జైలు నుంచి విడుదలై తాడిపత్రి వచ్చే క్రమంలో భారీ కాన్వాయ్ తో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని సీఐ దేవేంద్రకుమార్ నిలువరించారు. ర్యాలీలకు ప్రస్తుత నిబంధనలు ఒప్పుకోవని సీఐ స్పష్టం చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడినట్టు తెలిసింది.
స్థానిక సీఐతో ఆయన వ్యవహారశైలి వీడియోల్లోనూ స్పష్టమైంది. దాంతో సీఐ దేవేంద్ర కుమార్ తాడిపత్రిలో ఫిర్యాదు చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాకుండా, వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని తాడిపత్రి డీఎస్పీ వెల్లడించారు. ఈ రెండు కేసుల్లో తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆపై వారిద్దరినీ గుత్తి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చుతారని తెలుస్తోంది.