America: ప్రయాణ మార్గదర్శకాలను సవరించిన అమెరికా.. భారత్, చైనాలకు వెళ్లొద్దని సూచన
- లెవల్-4ని ఎత్తివేసిన అమెరికా
- భారత్, చైనా సహా 50 దేశాలకు వెళ్లొద్దని సూచన
- అమెరికాలో 50 లక్షలకు చేరువైన కేసులు
కరోనాతో అల్లాడిపోయిన అమెరికా తాజాగా తమ పౌరులపై ప్రయాణ ఆంక్షలను సవరించింది. వైరస్ తీవ్రత కారణంగా ఈ ఏడాది మార్చి 19 నుంచి విదేశాలకు వెళ్లేందుకు లెవల్-4 (ఆరోగ్య సూచన అత్యధిక స్థాయి)ని జారీ చేసింది. తాజాగా, మార్గదర్శకాలను సవరించిన అమెరికా లెవల్-4ను ఎత్తివేసింది. అయితే, భారత్, చైనా, ఆఫ్ఘానిస్థాన్, భూటాన్, సిరియా, సౌదీ అరేబియా, రష్యా, మెక్సికో, బ్రెజిల్, ఈజిప్ట్ వంటి మరో 50 దేశాలకు మాత్రం వెళ్లొద్దని తమ పౌరులకు సూచించింది.
ఆ దేశాల్లో సరిహద్దులు, విమానాశ్రయాల మూసివేతలు, ప్రయాణ ఆంక్షలు, హోం క్వారంటైన్ వంటి నిబంధనలు ఉన్నాయని గుర్తు చేసింది. కాబట్టి ఆయా దేశాలకు వెళ్తే మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, అమెరికాలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. 1.60 లక్షల మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.