Andhra Pradesh: ఒంగోలులో తగ్గని కరోనా ఉద్ధృతి.. లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న అధికారులు
- పట్టణంలో యథేచ్ఛగా పెరిగిపోతున్న కేసులు
- మార్గదర్శకాలను విస్మరిస్తున్న ప్రజలు
- లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమంటున్న అధికారులు
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒంగోలులో లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల ఉద్ధృతికి అడ్డుకట్టపడకపోవడంతో లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని అధికారులు నిర్ణయించారు.
ఇందులో భాగంగా రెండు వారాలపాటు లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు నిత్యావసరాలకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే, మెడికల్ షాపులు, పెట్రోలు బంకులు తెరిచే ఉండనున్నాయి.
పట్టణ ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బయటకు వచ్చేటప్పుడు కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని చెబుతున్నారు. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అంతేకాదు, లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించేలా అధికారాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
పట్టణంలో అధికారికంగా వెయ్యికిపైగా కేసులు నమోదు కాగా, అనధికారికంగా ఈ సంఖ్య 2 వేలు పైమాటేనని చెబుతున్నారు. ఒంగోలులో ప్రస్తుతం కరోనా అత్యంత ప్రమాదకరమైన థర్డ్ స్టేజిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఎటువంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యవంతులుగా కనిపిస్తున్న వారిలోనూ వైరస్ ఉంటోందని, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు వివరించారు. కాబట్టి వీటికి అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని చెబుతున్నారు.