Flight Simulation Technique Centre: భారీ శబ్దం వినపడింది.. సీట్ల కింద చిన్నారులు ఇరుక్కుపోయి కనిపించారు: విమాన ప్ర‌మాదంపై స్థానికుల కథనం

locals on flight tragedy

  • ఘ‌ట‌నాస్థ‌లికి వెంట‌నే వెళ్లాను
  • కొంత‌మంది కాళ్లు విరిగాయి
  • చాలా మంది కింద పడిపోయి ఉన్నారు
  • కాక్‌పిట్‌ విరగ్గొట్టి  పైలట్‌ను  బయటకు తీశారు

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మ‌రో 100 మందికి పైగా ప్ర‌యాణికులు గాయాల‌పాల‌యిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు ప‌లు విష‌యాలను వివ‌రించారు. భారీ శబ్దం వినప‌డ‌డంతో ఏదో జరిగిందని ఊహించి, తాను వెంటనే ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్లాన‌ని ఓ వ్యక్తి మీడియాకు చెప్పారు.

విమాన సీట్ల కింద కొంద‌రు చిన్నారులు ఇరుక్కుపోయి క‌న‌ప‌డ్డార‌ని తెలిపారు. చాలా మంది కింద పడిపోయి ఉన్నారని, గాయాల‌పాల‌య్యార‌ని చెప్పారు. కొంత‌మందికి కాళ్లు విరిగాయని, స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న త‌న‌ చేతులు, చొక్కా రక్తంతో తడిసిపోయాయని వివ‌రించారు.

స‌హాయక చ‌ర్య‌ల్లో పాల్గొన్న రెస్క్యూ సిబ్బంది కాక్‌పిట్‌ విరగ్గొట్టి గాయపడిన పైలట్‌ను బయటకు తీశారని మరో వ్యక్తి తెలిపాడు. అంబులెన్స్‌లు అక్క‌డికి చేరుకోకముందు నుంచే స్థానికులు గాయాల‌పాలైన వారిని కొంద‌రిని ప‌లు వాహ‌నాల్లో ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రుల‌కు తీసుకెళ్లారని చెప్పాడు.

కాగా, విమాన ప్రమాద ఘటనపై విమానయాన మంత్రిత్వ శాఖ ప్రమాద దర్యాప్తు విభాగం స‌మ‌గ్ర ద‌ర్యాప్తు ప్రారంభించింది. సంబంధిత అధికారులు ఈ రోజు తెల్ల‌వారుజాము నుంచే కోజికోడ్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. బాధితుల‌కు అన్ని విధాలుగానూ సాయ‌ప‌డ‌తామ‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తెలిపాయి.  

  • Loading...

More Telugu News