Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి ప్రెసిడెంట్ ఉండాలి: శశి థరూర్
- కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ గా కొనసాగుతున్న సోనియా
- రాహుల్ మళ్లీ వస్తే మంచిదేనన్న థరూర్
- రాహుల్ రాకపోతే కొత్త నాయకత్వంపై దృష్టి సారించాలని సూచన
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పార్టీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి చీఫ్ ఉండడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. పార్టీకి జవసత్వాలు లభించాలన్నా, పార్టీ చుక్కాని లేని నావలా తేలిపోతోందని ప్రజల్లో బలపడుతున్న అభిప్రాయాలకు అడ్డుకట్ట వేయాలన్నా... పార్టీకి పూర్తిస్థాయి ప్రెసిడెంట్ ను కనుగొనే ప్రక్రియను వేగవంతం చేయాలని థరూర్ అభిప్రాయపడ్డారు.
అయితే, రాహుల్ గాంధీలో మరోసారి పార్టీ పగ్గాలు అందుకోగల చేవ, సామర్థ్యం, యోగ్యత ఉన్నాయని భావిస్తున్నానని, కానీ ఆయన మళ్లీ అధ్యక్షుడిగా వచ్చేందుకు అంగీకరించకపోతే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు పార్టీ తన ప్రయత్నాలు ప్రారంభించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. "తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నాయకత్వాన్ని నేను కూడా స్వాగతించాను. కానీ, ఎప్పటికి తొలగిపోతుందో తెలియనంత భారాన్ని ఆమె మోయాలని భావించడం సరికాదు" అని వ్యాఖ్యానించారు.