Chandrababu: ఏపీలో కరోనా పరిస్థితి ప్రపంచంలోనే దారుణం అంటూ జాతీయ మీడియా కథనం...నేనప్పుడే చెప్పానంటూ చంద్రబాబు విమర్శలు
- ఏపీలో నిత్యం 10 వేలకు పైగా కొత్త కేసులు
- ఇప్పటికే రెండు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
- పెరుగుతున్న మరణాల సంఖ్య
ఏపీలో గత కొన్నిరోజులుగా నిత్యం 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదువుతున్నాయి. 13 జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రం అయినా ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఈ గణాంకాలు ఏపీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాయి. త్వరలోనే ఏపీ అత్యధిక కొత్త కేసుల జాబితాలో జాతీయస్థాయిని దాటి అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాల సరసన చేరుతుందని జాతీయ మీడియాలో ఓ కథనం వెలువడింది.
ఇప్పటికే ఏపీ కరోనా కేసుల విషయంలో జాతీయస్థాయిలో మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. జనాభా పరంగా దేశంలో పదో స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు రెండు లక్షల కేసులు, 1750కి పైగా మరణాలతో కొనసాగుతోందని వివరించారు. జూన్ ఆరంభం నాటికి ఏపీలో కేసుల సంఖ్య 4 వేలు కాగా, జూలై ఆరంభం నాటికి అది 15 వేలకు చేరిందని, కానీ ఆగస్టు మొదలయ్యేసరికి అది 1.5 లక్షలు దాటిందని ఈ కథనంలో తెలిపారు.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. "ఎప్పుడైతే కరోనా మహమ్మారిని పారాసిటమాల్ తో నయం చేయవచ్చు అన్నారో, బ్లీచింగ్ తో కరోనాను తుడిచిపెట్టేయవచ్చు అన్నారో ఆనాడే విపత్తుకు బీజం పడింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి నేను మొత్తుకుంటున్నాను. కానీ ఏపీ సర్కారు నా మాటలు చెవికెక్కించుకోలేదు" అంటూ విచారం వ్యక్తం చేశారు