Hyderabad: హైదరాబాద్ శివార్లలో ఇళ్లు కొనేస్తున్న డాక్టర్లు, వ్యాపారులు!

Doctors and Businessmen are Prime Buyers in Hyderabad New Homes

  • కరోనా కారణంగా పడిపోయిన అమ్మకాలు
  • అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఔత్సాహికులు
  • నగరానికి దూరంగా ఉన్న విల్లాలకు డిమాండ్
  • రూ.12 కోట్ల లోపున్న గృహాల్లో అమ్మకాల జోరు

కరోనా విజృంభణ ప్రారంభమైన తొలి రోజుల్లో కుదేలైన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇప్పుడు తిరిగి పుంజుకుంది. లాక్ డౌన్ సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇళ్లవైపు కూడా చూడని కొనుగోలుదారులు, ఇప్పుడు ఇళ్లు కొంటున్నారు. ముఖ్యంగా లగ్జరీ విల్లాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రూ. 5 కోట్ల నుంచి రూ. 12 కోట్ల మధ్య ఉన్న విల్లాలను డాక్టర్లు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు, సీనియర్ ఎగ్జక్యూటివ్ లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గోపనపల్లి, నార్సింగి, గండిపేట ప్రాంతాల్లో అధికంగా విక్రయాలు సాగుతున్నాయని నిర్మాణ రంగ వ్యాపారులు అంటున్నారు.

2019లో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 4 వేలకు పైగా అపార్ట్ మెంట్, విల్లాల అమ్మకాలు సాగగా, ఈ సంవత్సరం అదే సమయంలో విక్రయాలు 974 యూనిట్లకు పడిపోయాయి. ఇందులో 100కు పైగా ప్రీమియర్ యూనిట్లు ఉన్నాయి. కరోనా భయాలతో చాలా మంది నగరానికి కాస్తంత దూరంగా ఉన్న ఇళ్లను కొంటేనే మంచిదన్న ఉద్దేశంతో ఉన్నారని, అందువల్లే శివార్లలోనే వ్యాపారం సాగుతోందని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని సూపర్ లగ్జరీ అపార్టుమెంట్ల అమ్మకాలు పుంజుకున్నాయని తెలుస్తోంది.

"గత కొంతకాలంగా నేను ఓ ఇంటిని కొనాలని భావిస్తున్నాను. మహమ్మారి విస్తరించిన నేపథ్యంలో ఊరికి కాస్తంత దూరంగా ఉంటేనే బాగుంటుందని భావించాను. ఇదే సమయంలో ధరలు తగ్గాయి. దీంతో నేను నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్సింగిలో 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని విల్లాను రూ. 6 కోట్లతో కొనుగోలు చేశాను" అని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడు వెల్లడించారు.

గత నెలలో గోపనపల్లిలోని విల్లాలను అమెరికాకు చెందిన ఎన్నారైల బృందం కొనుగోలు చేసింది. తామంతా ఇండియాకు తిరిగి వచ్చేయాలని భావిస్తున్న వారిమేనని చెప్పారు. ఇవన్నీ సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ విల్లాలని, ప్రైవేటు స్విమ్మింగ్ పూల్స్, అన్ని సౌకర్యాలతో ఉన్న కిచెన్ తదితర సౌకర్యాలతో ఉన్నవేనని, వీటిని ఒక్కోటి రూ. 9 కోట్లకు కొన్నామని గునిగంటి ప్రవీణ్ అనే లగ్జరీ ప్రాజెక్ట్ డీలర్ తెలిపారు. ఇటువంటివే మరో మూడు డీల్స్ చేస్తున్నామని అన్నారు.

హైదరాబాద్ లో, శివార్లలో ఉన్న పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరిగిందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య ఉన్న డీలక్స్ అపార్ట్ మెంట్ల అమ్మకాలు కూడా తృప్తిగానే సాగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా సిద్ధమైన ఇళ్లకు, అతి త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేసుకునే ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ లో విక్రయించబడిన 154 యూనిట్లలో 65 యూనిట్లు హై ఎండ్ లగ్జరీ యూనిట్లని అపర్ణా కన్ స్ట్రక్షన్స్ డైరెక్టర్ డీఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ఈ సంఖ్య చాలా గొప్పదని తాము భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News