USA: అమెరికాలో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన... స్కూళ్లు తెరవక ముందే 97 వేల మంది చిన్నారులకు కరోనా!
- అమెరికాలో తగ్గని కరోనా విస్తృతి
- స్కూళ్లను తిరిగి తెరిపించేందుకు ఏర్పాట్లు
- ఇప్పుడే వద్దంటున్న తల్లిదండ్రులు
- ఇప్పటివరకూ 25 వేల మంది చిన్నారుల మృతి
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కాస్తంత కుదుటపడుతున్న ఎన్నో దేశాలు, ఈ విద్యా సంవత్సరం స్కూళ్లను తెరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ, తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగించే వార్త వెలువడింది. గడచిన రెండు వారాల్లో ఒక్క అమెరికాలోనే 97 వేల మంది చిన్నారులు కరోనా వైరస్ బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వెల్లడించింది. జూలై 16 నుంచి జూలై 30 మధ్య దాదాపు లక్ష మంది పిల్లలకు వ్యాధి సోకిందని, దీంతో స్కూళ్లను తిరిగి తెరిపించడంపై అధికారులు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.
అమెరికాలో ఇంతవరకూ సుమారు 50 లక్షల మంది కరోనా బారిన పడ్డారని వెల్లడించిన సీబీఎస్ న్యూస్ వీరిలో సుమారు 3.38 లక్షల మంది పిల్లలేనని తెలిపారు. సమీప భవిష్యత్తులో పిల్లలకు టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే పరిస్థితులను అవగతం చేసుకోవచ్చని వాండర్ బిల్ట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ టినా హార్టర్ట్ వ్యాఖ్యానించారు. పాఠశాలలను తెరవడానికి ముందే చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు.
ఇప్పటికే 2 వేలకు పైగా కుటుంబాలకు డీఐపీ వెస్టింగ్ కిట్స్ ను పంపించి, వాటిని ఎలా వినియోగించాలో అవగాహన కల్పించామని, పిల్లల నుంచి శాంపిల్స్ స్వీకరించడం, వాటిని సెంట్రల్ రిపాసిటరీకి ఎలా పంపించాలన్న విషయమై వివరించి చెబుతున్నామని టీనా వ్యాఖ్యానించారు. అమెరికాలోనే అతిపెద్ద స్కూల్ డిస్ట్రిక్ట్ గా ఉన్న న్యూయార్క్ నగరంలో మేయర్ బిల్ డీ బ్లాసియో నేతృత్వంలో పాఠశాలల పునరుద్ధరణపై పెద్దఎత్తునే కసరత్తు జరుగుతోంది.
కాగా, అమెరికాలో ఇప్పటివరకూ కరోనా కారణంగా దాదాపు 25 వేల మందికి పైగా పిల్లలు చనిపోయారు. దీంతో ఆన్ లైన్ క్లాసులను మాత్రమే ఈ సంవత్సరం జరిపించాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వస్తోంది. దేశంలోని 13 వేలకు పైగా స్కూళ్లను తెరిపించి, పిల్లలను తిరిగి ఎలా రప్పించాలన్న విషయమై మధనపడుతున్నారు. వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో వ్యాక్సిన్ వచ్చేంత వరకూ స్కూళ్లు వద్దని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.