Nimmakayala Chinarajappa: తప్పుడు కేసులతో తొక్కేయాలని చూస్తున్నారు: టీడీపీ నేత చినరాజప్ప విమర్శలు
- ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు
- ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే.. కేసులు పెడుతున్నారు
- జేసీని మళ్లీ అరెస్ట్ చేయడం దారుణం
పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాలను తొక్కేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని టీడీపీ నేత చినరాజప్ప మండిపడ్డారు. బెయిల్ మీద కడప జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారనే కారణాలతో మళ్లీ అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించడం దారుణమని అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే అరెస్టు చేయిస్తారా? అని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, మధుసూదన్ రెడ్డి రోడ్ల మీద పడి, ఊరేగింపులు చేసినా కేసులు లేవని మండిపడ్డారు. ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని... అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
గుంటూరు జిల్లాలో ఒక మైనార్టీ వ్యక్తిని సీఐ దుర్భాషలాడారని... అయినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చినరాజప్ప చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక లారీని అడ్డుకున్న దళిత యువకుడికి పోలీసులే శిరోముండనం చేయిస్తే... ఉదాసీనంగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా... ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.