Japan: అమెరికా, రష్యా అణ్వాయుధాల శక్తిని పెంచుకుంటున్నాయి: జపాన్
- నాగసాకిపై అమెరికా అణుబాంబుతో దాడి చేసి నిన్నటికి 75 ఏళ్లు
- అణ్వాయుధాలను నిషేధించాలని ప్రపంచ దేశాలకు జపాన్ విజ్ఞప్తి
- ఒప్పందానికి ఎవరూ కట్టుబడట్లేదన్న అబే
- రష్యా, అమెరికా అణ్వాయుధాలను తగ్గించుకోవాలని పిలుపు
జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా 1945 ఆగస్టు 6న అణుబాంబుతో దాడి చేసింది. ఆ తర్వాత నాగసాకిపై ఆగస్టు 9న మరో అణుబాంబును వేసింది. మానవచరిత్రలో అత్యంత వినాశనకర ఘటనల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయిన ఈ ఘటన దేశాల మధ్య ఆయుధాల పోటీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియ చెబుతుంది. నాగసాకిపై అణుబాంబుతో దాడి చేసి నిన్నటికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. అణుబాంబుల దాడిలో మృతి చెందిన వారికి జపాన్ ప్రజలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అణ్వాయుధాలను నిషేధించాలని ప్రపంచ దేశాలకు జపాన్ విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్బంగా జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ.. అణ్వాయుధాల ఒప్పందానికి ఎవరూ కట్టుబడట్లేదని తెలిపారు. రష్యా, అమెరికా తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను తగ్గించుకోవాలని ఆయన చెప్పారు. న్యూక్లియర్ వెపన్స్ నాన్- ప్రొలిఫిరేషన్ ట్రెటీ అమల్లోకి వచ్చి 50 ఏళ్లు అవుతోందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ, దాన్ని లెక్క చేయకుండా ప్రపంచ దేశాలు ముందుకెళుతున్నాయని విమర్శించారు.
నాగసాకి నగర మేయర్ టొమిహిమ టావ్ మాట్లాడుతూ... అమెరికా, రష్యా అణ్వాయుధాల శక్తిని పెంచుకుంటున్నాయని విమర్శించారు. 2017లో రూపొందించిన అణ్వాయుధాల నిషేధ ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆయన ప్రపంచ దేశాలను కోరారు.