Penumatsa Sambasiva Raju: మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతిపై చంద్రబాబు, లోకేశ్ విచారం
- విలువలకు మారుపేరుగా అభిమానాన్ని సంపాదించుకున్నారు
- ఆయన మరణం విచారకరం
- రాష్ట్ర రాజకీయాలకు తీరనిలోటు
- ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. 'సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా, విలువలకు మారుపేరుగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీ పెన్మత్స సాంబశివరాజుగారి మరణం విచారకరం. రాష్ట్ర రాజకీయాలకు తీరనిలోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
'రాజకీయాలలో 6 దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి శ్రీ పెనుమత్స సాంబశివరాజు గారి మృతి బాధాకరం. రాజకీయాలలో ఉన్నత విలువలు నెలకొల్పిన రాజుగారు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటేనే ఆయన పట్ల ప్రజలు ఎంత ఆదరాభిమానాలు చూపించారో అర్థం అవుతోంది. రాజుగారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.