Telangana: విజయవాడ కరోనా చికిత్సా కేంద్రంలో అగ్నిప్రమాదం నేపథ్యంలో తెలంగాణలో ముందు జాగ్రత్తలు
- తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం
- కరోనా ఆసుపత్రులు, కేంద్రాల్లో తనిఖీలకు ఆదేశం
- నిబంధనల ఉల్లంఘన జరిగితే ఉపేక్షించేది లేదన్న అధికారులు
- అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు
విజయవాడలో కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా ఇటువంటి ప్రమాదమే చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా కేర్ సెంటర్లు ఉన్న హోటళ్లతో పాటు అన్ని కరోనా ఆసుపత్రులు, కేంద్రాల్లో అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘన జరిగితే ఉపేక్షించేది లేదని పేర్కొంది.
తెలంగాణలో కరోనా కేంద్రాల కోసం 36 హోటళ్లు మాత్రమే అనుమతి పొందాయి. అయితే, అనుమతి పొందని హోటళ్లలోనూ కరోనా రోగులను ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. కరోనా కేంద్రాల్లో భద్రతా చర్యల కోసం వైద్యారోగ్య శాఖ అధికారులు పలు సూచనలు చేశారు.
అగ్నిప్రమాద నివారణ కోసం జనరేటర్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగితే విద్యుత్ నిలిపివేసి జనరేటర్‌ను ఆన్ చేయాలని తెలిపారు. కరోనా కేంద్రాల భవనాలపై పెద్ద నీటి ట్యాంకును ఏర్పాటు చేయాలని చెప్పారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే, అందరూ బయటకు రావడానికి వీలుగా రెండు మార్గాల్లో మెట్లు ఉండాలని పేర్కొన్నారు.