Gadikota Srikanth Reddy: చంద్రబాబూ, విజయవాడ ప్రమాద ఘటనపై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలి?: నిలదీసిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

Srikanth Reddy fires on TDP Chief Chandrababu over Vijayawada fire accident

  • రెండు నాలుకల ధోరణి మానుకోవాలంటూ చంద్రబాబుకు హితవు
  • చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యలు
  • రాక్షసానందం పొందుతున్నారంటూ విమర్శలు

చంద్రబాబు నిర్వహించే జూమ్ యాప్ కాన్ఫరెన్సుల్లో పాల్గొనే రమేశ్ చౌదరి నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

 విజయవాడలో నిన్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మరణించడం తెలిసిందే. ఈ హోటల్ ను స్థానిక రమేశ్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్ గా ఉపయోగించుకుంటోంది. ఈ హాస్పిటల్ అధినేత రమేశ్ చౌదరి విషయంలో చంద్రబాబు మౌనం వెనుక అర్థం ఏమిటని శ్రీకాంత్ రెడ్డి ఓ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ప్రతిదానికి కులంతో ముడిపెట్టి రాద్ధాంతం చేసే చంద్రబాబు... రమేశ్ చౌదరి విషయంలో ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.

"మీ పార్టీకి సంబంధించిన వాళ్లు చేస్తే ఒకరకంగా, ఇతరులు చేస్తే ఒకరకంగా స్పందించడం మీ నైజం... మీ నైజాన్ని బయటపెట్టేందుకే మేం ప్రయత్నిస్తున్నాం. ఓ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసే వ్యక్తి ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు. అందరికీ అతీతంగా వ్యవహరించినప్పుడే మనం నాయకులం అవుతాం. అలాంటి ఉద్దేశం నీకే కోశానా లేదు. నీకు తెలిసిందల్లా ప్రతిదానికీ కుల రాజకీయాలు చేయడమే! తప్పు చేసిన వాళ్లను శిక్షించినా కుల ప్రస్తావన తీసుకువస్తావు. స్వయానా నీ పార్టీ వాళ్లే బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీలపైన దాడిచేసినా అందుకు ప్రభుత్వానిదే తప్పంటావు. ఈ రెండు నాల్కల ధోరణి మానుకోవాలి.

అమరావతి విషయంలోనూ అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. మేమెప్పుడూ అమరావతికి అన్యాయం చేయాలని భావించలేదు. అమరావతిని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం. అమరావతితో పాటు వికేంద్రీకరణ కూడా మాకు ముఖ్యమని చెబుతున్నాం. రాష్ట్ర నడిబొడ్డున జరిగిన విజయవాడ అగ్నిప్రమాదంపై మాత్రం ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తున్నాం. ఈ ఘటనలో ఫలానా వ్యక్తులది తప్పు అని ఎందుకు నీ నోట్లోంచి ఒక్క మాటా కూడా రావడం లేదని అడుగుతున్నాం.

కానీ చంద్రబాబు గారూ, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు. మీ ఉద్దేశాలన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. మీకు ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదని భావించి, ఆ జూమ్ యాప్ ద్వారా లేనిపోనివి ఏదో ఒకటి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మిమ్మల్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఎవరైనా గానీ తప్పు చేసినవాడికి శిక్ష పడాలన్నదే మా ప్రభుత్వ నైజం. విజయవాడ ఘటనపై కమిటీ వేయడమే కాకుండా ఎక్స్ గ్రేషియా రూ.50 లక్షలు కూడా ప్రకటించాం. కమిటీ నివేదిక వచ్చాక కారకులపై కఠినచర్యలు తీసుకుంటాం" అని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News