Sanjay Raut: తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో సుశాంత్ మనస్తాపం చెందాడన్న శివసేన నేత.. ఆగ్రహం వ్యక్తం చేసిన సుశాంత్ సోదరుడు

Shivsena MP Sanjay Raut comments on Sushant Singh Rajput issue
  • సుశాంత్ కేసులో రాజకీయ నేతల వ్యాఖ్యలు
  • తండ్రితో సుశాంత్ కు సరైన సంబంధాలు లేవన్న సంజయ్ రౌత్
  • రౌత్ వ్యాఖ్యల్లో నిజంలేదన్న సుశాంత్ సోదరుడు నీరజ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పటి నుంచి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

 సుశాంత్ తండ్రి కేకే సింగ్ రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆ వివాహం కారణంగా సుశాంత్ తన తండ్రిపై వ్యతిరేకతతో ఉన్నాడని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సుశాంత్ తన తండ్రిని ఎన్నిసార్లు కలిశారో చెప్పాలని అన్నారు. సుశాంత్ చనిపోయిన 40 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు బయటికి వచ్చారని, సుశాంత్ ముంబయిలో చనిపోతే పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని విమర్శించారు.

దీనిపై సుశాంత్ సోదరుడు నీరజ్ మండిపడ్డారు. సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ రౌత్ చేసిన వ్యాఖ్యల్లో నిజంలేదని, దీనిపై రౌత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. అటు రౌత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ విభేదించారు. సుశాంత్ వ్యవహారంలో రౌత్ చేస్తున్న వ్యాఖ్యలు చవకబారుతనంగా ఉన్నాయని అన్నారు. ఇది ఎంతో సున్నితమైన అంశం అని, దీనిపై శివసేన స్పందిస్తున్న తీరు సరిగాలేదని విమర్శించారు.
Sanjay Raut
Sushant Singh Rajput
KK Singh
Mumbai
Patna

More Telugu News