JP Nadda: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయకపోవడం వల్ల 98 లక్షల మంది నష్టపోతున్నారు: జేపీ నడ్డా
- వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్న నడ్డా
- హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా సర్కారులో చలనంలేదని విమర్శలు
- కేసీఆర్ ను కుంభకర్ణుడితో పోల్చిన నడ్డా
వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇచ్చారో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాంటి తీర్పే ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కరోనా విలయం సృష్టిస్తున్న వేళ సీఎం కేసీఆర్ వైఖరి కుంభకర్ణుడ్ని తలపిస్తోందని, తెలంగాణ సర్కారు ఇప్పటికీ అప్రమత్తం కావడంలేదని విమర్శించారు. కరోనా పరీక్షలు చేయడంలో తెలంగాణ చురుగ్గా వ్యవహరించలేకపోతోందని అన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల 98 లక్షల మందికి బీమా సౌకర్యం దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నా కేసీఆర్ సర్కారులో చలనం లేదని అన్నారు. తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు వర్చువల్ విధానంలో భూమిపూజలు నిర్వహించగా, జేపీ నడ్డా ఢిల్లీ నుంచే వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.