Ramoji Rao: మార్గదర్శి కేసులో.. రామోజీరావుకు నోటీసులు పంపిన సుప్రీంకోర్టు

Supreme Court serves notices to Ramoji Rao

  • మార్గదర్శి కేసును కొట్టేసిన ఉమ్మడి ఏపీ హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన ఉండవల్లి
  • ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు, మార్గదర్శికి నోటీసులు పంపిన సుప్రీం

మార్గదర్శి కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ద్వారా రూ. 2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో రామోజీరావు సేకరించారని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండవల్లి పిటిషన్ వేశారు. అయితే ఉమ్మడి హిందూ కుటుంబం ద్వారా డిపాజిట్లు సేకరించడం నేరం కాదని హైకోర్టు ముందు రామోజీరావు వాదనలను వినిపించారు. రామోజీరావు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు... ఉమ్మడి హైకోర్టు విభజన రోజున ఈ కేసును కొట్టేసింది.

కేసును కొట్టేసినట్టు ఆలస్యంగా గ్రహించిన ఉండవల్లి... హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టును ఆశ్రయించడంలో జరిగిన జాప్యాన్ని మన్నించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఆర్బీఐ, మాజీ ఐజీ కృష్ణంరాజును కూడా ఇంప్లీడ్ చేయాలని ఉండవల్లి పెట్టుకున్న దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసింది. రామోజీ, మార్గదర్శి ఫైనాన్స్, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, కృష్ణంరాజుకు నోటీసులను జారీ చేసింది. తమ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. సమాధానాలు అందిన తర్వాత తదుపరి విచారణను చేపట్టనున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News