JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు రషీద్ మృతి
- అనారోగ్యంతో రషీద్ మృతి
- 2018లో సీఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై దాడి
- బెయిల్ పై విడులైనప్పటి నుంచి అజ్ఞాతంలో రషీద్
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు వెంటనే మరో షాక్ తగిలిన సంగతి తెలిసిందే. కడప సీఐను దూషించారనే కేసులో వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి విడుదలయ్యామనే ఆనందం వారికి ఒక్క రోజు కూడా నిలవలేదు. ఈ క్రమంలో, జేసీ వర్గీయులకు మరో షాక్ తగిలింది.
ప్రభాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న రషీద్ మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన... నిన్న ఉదయం కన్నుమూశాడు. 2018 డిసెంబర్ లో రషీద్ ను అరెస్ట్ చేసేందుకు కడప జిల్లాకు చెందిన అప్పటి సీఐ హమీద్ తన సిబ్బందితో కలిసి తాడిపత్రికి చేరుకున్నారు. ఆ సందర్భంగా రషీద్ తో పాటు అతని అనుచరులు సీఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి కడప జిల్లా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
ఈ కేసుతో పాటు ఇతర కేసుల్లో కూడా రషీద్ నిందితుడిగా ఉన్నాడు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడంలో టీడీపీ శ్రేణులు ఆవేదనలో మునిగిపోయారు.