Nallapochamma: సచివాలయం కూల్చివేత తరువాత... కనిపించని నల్ల పోచమ్మ విగ్రహం!
- కూల్చివేత సమయంలో శిధిలాలు పడి దెబ్బతిన్న గుడి
- ఆలయాన్ని ఆ తరువాతే తొలగించామన్న అధికారులు
- విగ్రహం ఎక్కడ ఉందో తెలియదంటున్న పూజారులు
హైదరాబాద్ లోని సచివాలయం కూల్చివేత తరువాత, ఆ ప్రాంగణంలోనే ఉన్న ఆలయంలోని నల్ల పోచమ్మ విగ్రహం కనిపించడం లేదని తెలుస్తోంది. కొత్త సెక్రటేరియేట్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన తరువాత, పాత భవనాలన్నింటినీ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆలయం పక్కనే ఉన్న భవనాలను కూల్చివేస్తుండగా, ఆ శిథిలాలు పడి, పోచమ్మ ఆలయం దెబ్బతిన్నదని, అందువల్లే ఆలయాన్ని తొలగించాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. అయితే, ఆ విగ్రహం ఎక్కడుందన్న సంగతి మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
విగ్రహాన్ని తొలగించే ముందు ఆలయంలో రోజూ పూజాధికాలు నిర్వహించే పూజారులకు తెలియనివ్వలేదని, గజ్వేల్ నుంచి రప్పించిన పూజారులతో విగ్రహాన్ని తీయించి, మరో చోటకు తరలించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎంతో శక్తిమంతమైన నల్ల పోచమ్మకు నిత్యమూ పూజలు జరిపించకుంటే, అరిష్టమని, ఇప్పుడా విగ్రహం ఎక్కడుందో కూడా తెలియడం లేదని ఆలయ పూజారులు అంటున్నారు.