Vamsichand Reddy: రాయలసీమ కోసం దక్షిణ తెలంగాణను నాశనం చేస్తారా?: వంశీచంద్‌రెడ్డి
- దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారు
- రాయలసీమ ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణకు తీవ్ర ముప్పు
- కేసీఆర్ కు కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ఎక్కువయ్యాయి
దక్షిణ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను అడ్డుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలే కేసీఆర్ కు ఎక్కువయ్యాయని విమర్శించారు.
రాయలసీమను రతనాల సీమ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టుందని వంశీచంద్ దుయ్యబట్టారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడంపై తమకు అభ్యంతరం లేదని... అయితే, ఇదే సమయంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసే చర్యలను అంగీకరించబోమని చెప్పారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారని ఆరోపించారు.