Andhra Pradesh: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ!
- జీతాలు, పెన్షన్లను 50 శాతం చెల్లించేలా జీవోలు తెచ్చిన ప్రభుత్వం
- జీవోలను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం
- 12 శాతం వడ్డీతో కలిపి బకాయిలు చెల్లించాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 50 శాతం జీతాలు, పెన్షన్లను చెల్లించాలన్న ఏపీ ప్రభుత్వ జీవోలను ధర్మాసనం కొట్టేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో 12 శాతం వడ్డీతో కలిపి ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను చెల్లించాలని ఆదేశించింది.
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని... ఆర్థిక ఇబ్బందుల వల్ల 50 శాతం చెల్లింపులు మాత్రమే చేయాలని ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. దీనిపై విశాఖ రిటైర్డ్ జడ్జి కామేశ్వరి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టేసింది. వడ్డీతో కలిపి బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.