Thoothukudi: తూత్తుకుడి తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసు: ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై కరోనాతో మృతి
- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లాకప్‌డెత్ కేసు
- మొబైల్ షాపు తెరిచారంటూ తండ్రీకొడుకులను అరెస్ట్ చేసి చిత్రహింసలు
- కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు తూత్తుకుడి జిల్లా లాకప్‌డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై పాల్‌దురై (56) కరోనాతో మృతి చెందారు. అనారోగ్యంతో మధురై ఆసుపత్రిలో చేరిన ఆయనకు నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ షాపు తెరిచారంటూ పి. జయరాజ్ (59), ఆయన కుమారుడు జె.బెన్నిక్స్ (31)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తీవ్ర గాయాలపాలైన తండ్రీకొడుకులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు దారుణంగా హింసించడం వల్లే వారు చనిపోయారంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన 10 మంది పోలీసులను సస్పెండ్ చేసి కేసును సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తులో ఉండగానే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై పాల్‌దురై కరోనాతో కన్నుమూశారు.