Kamala Harris: యూఎస్ ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్... భారత సంతతి మహిళను నిలిపిన డెమోక్రాట్లు!
- పేరును స్వయంగా ప్రతిపాదించిన జో బిడెన్
- ఆమె తన భాగస్వామురాలు కావడం గర్వకారణమని వ్యాఖ్య
- విజయం సాధిస్తే, భావి యూఎస్ అధ్యక్షురాలయ్యే అవకాశాలు
ఈ సంవత్సరం నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై కన్నేసిన డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి నేత, కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. యూఎస్ లో ఫియర్ లెస్ లేడీగా గుర్తింపు పొంది, దేశంలోని అద్భుతమైన ప్రజా సేవకుల్లో ఒకరైన కమలా హారిస్ పేరును తాను ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని 77 సంవత్సరాల బిడెన్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
ఎన్నికలు ముగిసే వరకూ తన ప్రచారంలో ఆమె భాగస్వామిగా ఉంటారని, తమ భాగస్వామ్యంతో విజయం మరింత సులువవుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇక, తన పేరును వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేట్ చేయడంపై కమలా హారిస్ సైతం స్పందించారు. ఇది తనకు దక్కిన గౌరవమని అన్నారు. బిడెన్ ను కమాండర్-ఇన్-చీఫ్ గా అభివర్ణిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు.
"అమెరికా ప్రజలను జో బిడెన్ ఒకే మాట, ఒకే బాటపై నడిపించగలరు. తన జీవితకాలం పాటు ఆయన అమెరికా కోసం శ్రమించారు. ఆయన అధ్యక్షుడైతే అమెరికా మరో మెట్టెక్కుతుంది. మన జీవితాలు మరింత మెరుగుపడతాయి" అని తన ట్విట్టర్ ఖాతాలో కమలా హారిస్ వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా, అమెరికాకు తదుపరి 2024లో జరిగి ఎన్నికల్లో లేదా 2028లో జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడటం ఖాయమని ఇప్పటి నుంచే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు ఎన్నో దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వచ్చారు. తండ్రి జమైకన్ కాగా, తల్లి ఇండియన్. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ కమలా హారిస్. యూఎస్ సెనేట్ కు ఎన్నికైన తొలి సౌత్ ఆసియా దేశాల సంతతి కూడా ఆమే.