Chris Broad: కుమారుడికి జరిమానా విధించిన తండ్రి... ఇంగ్లండ్ క్రికెట్ లో అరుదైన ఘటన!
- పాకిస్థాన్ తో ఇంగ్లండ్ మ్యాచ్
- యాసిర్ ను అవుట్ చేసిన స్టువర్ట్
- పెవిలియన్ కు వెళుతుండగా అనుచిత వ్యాఖ్యలు
క్రికెట్ నియమావళిని ఉల్లంఘించిన తన కుమారుడికి స్వయంగా ఉన్నతాధికారిగా ఉన్న అతని తండ్రే జరిమానా విధించిన సంఘటన ఇది. ప్రస్తుతం ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మ్యాచ్ రిఫరీ కౌన్సిల్ లో క్రిస్ బ్రాడ్ పనిచేస్తుండగా, అతని కుమారుడు స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లండ్ జట్టులో ఫస్ట్ బౌలర్ గా ఆడుతున్నాడు. ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో స్టువర్ట్ నిబంధనలను ఉల్లంఘించాడు. దీనిపై స్పందించిన క్రిస్ బ్రాడ్, తన కొడుకు మ్యాచ్ ఫీజులో 15 శాతం ఫైన్ వేశారు. అంతేకాదు... అతనికి ఓ డీ మెరిట్ పాయింట్ ను కూడా వేశారు.
ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో పాక్ ఆటగాడు యాసిర్ షా, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యి, పెవిలియన్ కు బయలుదేరాడు. ఈ సమయంలో స్టువర్ట్, యాసిర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మైదానంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. జరిగిన ఘటనపై ఫీల్డ్ లో ఉన్న అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. విచారించిన క్రిస్ బ్రాడ్, ఐసీసీ నిబంధనల్లోని 2.5 ఆర్టికల్ ప్రకారం, ప్రత్యర్థి ఆటగాడు అవుట్ అయిన సమయంలో ఎగతాళి చేయడం తప్పేనని తేలుస్తూ, ఈ జరిమానా విధించారు.