Dalit: తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి స్పందన... కేసు ఫైలు ఏపీ జీఏడీకి బదిలీ!
- దళిత యువకుడికి శిరోముండనం చేయించిన పోలీసులు
- మావోయుస్టుల్లో చేరేందుకు అనుమతించాలంటూ రాష్ట్రపతికి బాధితుడి లేఖ
- జనార్దన్ బాబును కలవాలని బాధితుడికి రాష్ట్రపతి కార్యాలయం సూచన
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి వెంటనే స్పందించారు. ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన జీఏడీ) విభాగానికి ఈ కేసుకు సంబంధించిన ఫైల్ ను బదిలీ చేశారు. బాధితుడికి అండగా ఉండేందుకు అసిస్టెంట్ సెక్రటరీ జనార్దన్ బాబును కేటాయించారు. ఈ విషయంలో పూర్తి వివరాలతో జనార్దన బాబును కలవాలని బాధితుడు ప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది.
తనకు శిరోముండనం చేసిన తర్వాత దీనికి కారణమైన వ్యక్తులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో... రాష్ట్రపతికి ప్రసాద్ లేఖ రాశారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని... రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నానని... మావోయిస్టుల్లో చేరి తనకు తానే న్యాయం చేసుకుంటానని... మావోయిస్టుల్లో చేరేందుకు అనుమతించాలని లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖపై 24 గంటల్లో రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం గమనార్హం.