Pakistan: పచ్చని మొక్కలు మతానికి విరుద్ధమట.. 6 వేల మొక్కలు పీకేశారు!
- ఇమ్రాన్ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా 35 లక్షల మొక్కలను నాటిన వైనం
- పాకిస్థాన్ లోని ఖైబర్ రాష్ట్రంలో 6 వేల మొక్కలు పీకేసిన వైనం
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఖైబర్ ముఖ్యమంత్రి
అర్థం పర్థం లేని మతఛాందసవాదంతో కొందరు పర్యావరణానికే ముప్పుగా పరిణమించారు. పర్యావరణ పరిరక్షణ కోసం నాటిన వేలాది మొక్కలను పీకేసిన ఘటన పాకిస్థాన్ లోని ఖైబర్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పర్యావరణం దారుణమైన పరిస్థితుల్లో ఉన్న దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ వ్యాప్తంగా మొక్కలను నాటాలంటూ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆదివారం నాడు 35 లక్షల మొక్కలను నాటారు.
అయితే మొక్కలను నాటిన గంటల వ్యవధిలోనే ఖైబర్ రాష్ట్రంలోని మండికాస్ జిల్లాలో కొందరు అతివాదులు రెచ్చిపోయారు. మొక్కలు నాటడం తమ మతానికి వ్యతిరేకమంటూ ఓ గ్రౌండ్ లో నాటిన దాదాపు 6 వేల మొక్కలను పీకేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఈ ఘటనతో పర్యావరణ ప్రేమికులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఖైబర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీంతో, మొక్కలను పీకిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.