Woman: కరోనా యాంటీబాడీలు ఎక్కువకాలం ఉండట్లేదన్న వాదనలు నిజమేనా..?
- చైనాలో రెండోసారి కరోనా బారినపడిన మహిళ
- ఆర్నెల్ల వ్యవధిలో మరోసారి కరోనా నిర్ధారణ
- జియాంగ్జు నగరంలో ఘటన
ఏదైనా వ్యాధులకు గురైన మానవుడు కోలుకున్న తర్వాత ఆ వ్యాధికి సంబంధించిన నిరోధక శక్తి యాంటీబాడీల రూపంలో ఏర్పడుతుంది. కరోనా విషయంలోనూ ఇలాగే జరుగుతున్నా, యాంటీబాడీలు మనిషి శరీరంలో ఎక్కువకాలం ఉండడంలేదన్న వాదనలు కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడా వాదనలు నిజమనిపించే సంఘటన చైనాలో జరిగింది.
68 ఏళ్ల వృద్ధురాలికి ఆర్నెల్ల వ్యవధిలో కరోనా రెండోసారి సోకింది. జియాంగ్జు నగరానికి చెందిన ఆ మహిళకు మొదట ఫిబ్రవరి 8న కరోనా పాజిటివ్ అని తేలింది. అదే నెలాఖరుకు ఆమె కరోనా నుంచి కోలుకుంది. అయితే మళ్లీ ఆగస్టు 9న ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. నెలకిందట ఇజ్రాయెల్ లో ఓ వైద్యుడికి కూడా ఇలాగే రెండోసారి కరోనా సోకింది. ఈ ఘటనల నేపథ్యంలో కరోనాను జయించిన వారిలో ఏర్పడే ఇమ్యూనిటీ తాత్కాలికమేనన్న సందేహాలు బలపడుతున్నాయి. అయితే, కచ్చితత్వం లేని కరోనా టెస్టుల్లో ఒక్కోసారి తప్పుడు ఫలితాలు కూడా వస్తుంటాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.