Karan Tiwari: ఐపీఎల్ లో తనను తీసుకోకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన 'జూనియర్ స్టెయిన్'!
- ఫ్యాన్ కు వేళ్లాడుతూ విగతజీవుడిలా కనిపించిన కరణ్ తివారీ
- లభించని సూసైడ్ నోట్
- ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు కేసు నమోదు
మానసిక కుంగుబాటుతో ఓ యువ క్రికెటర్ తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. కరణ్ తివారీ అనే ఫాస్ట్ బౌలర్ తనను ఐపీఎల్ లోకి తీసుకోలేదన్న వేదనతో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ముంబయిలోని మలాద్ లో ఈ ఘటన జరిగింది. బెడ్ రూం నుంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసిన కుటుంబ సభ్యులకు ఫ్యాన్ కు వేళ్లాడుతూ విగతజీవుడిలా కరణ్ తివారీ కనిపించాడు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లేకపోవడంతో పోలీసులు దీన్ని ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు.
కరణ్ తివారీని ముంబయి క్రికెట్ వర్గాల్లో అందరూ 'జూనియర్ స్టెయిన్' అంటారు. తివారీ బౌలింగ్ స్టయిల్ అచ్చం సఫారీ స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్ ను పోలివుండడమే అందుకు కారణం. ముంబయి వాంఖెడేలో ఐపీఎల్ జట్లకు నెట్ బౌలర్ గా సేవలు అందిస్తున్నాడు. అయితే, కరణ్ తివారీని ఏ ఫ్రాంచైజీ తీసుకోనందునే అతడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.
ఈ ఘటనకు ముందు కరణ్ తివారీ రాజస్థాన్ లో ఉన్న మిత్రుడికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆ మిత్రుడు రాజస్థాన్ లోనే ఉంటున్న కరణ్ సోదరికి విషయం తెలుపగా, ఆమె ముంబయి ఫోన్ చేసి తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ క్రికెటర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.