Telangana: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులపై ఉక్కుపాదం: తెలంగాణ డీజీపీ
- బెంగళూరు ఘటన నేపథ్యంలో అప్రమత్తం
- అసభ్యకర, అసత్య పోస్టులు పెట్టొద్దని సూచన
- అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశం
ఓ వివాదాస్పద పోస్టు బెంగళూరులో అల్లర్లకు కారణం కావడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి పోస్టులు ఆస్తి, ప్రాణ నష్టాలకు దారి తీస్తాయని, కాబట్టి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
సోషల్ మీడియాపై పోలీసుల నిఘా ఎల్లవేళలా కొనసాగుతుందని, అసభ్యకర, అల్లర్లకు కారణమయ్యే పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్ఓ)కు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, వివాదాస్పద, శాంతిభద్రతలకు భంగం కలిగించే అసత్య పోస్టులను పెట్టొద్దని డీజీపీ సూచించారు.