Telangana: తెలంగాణలో ఈసారి పంద్రాగస్టు వేడుకలు ప్రగతి భవన్‌లోనే!

Independence day celebrations in Telangana will be held pragathi Bhavan

  • కరోనా విజృంభణ నేపథ్యంలో గోల్కొండ వేడుకలకు సీఎం దూరం
  • జిల్లా స్థాయిలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రులు  
  • ఉత్తర్వులు జారీ చేసిన సోమేశ్‌కుమార్

తెలంగాణలో ఈసారి పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలో కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లోనే జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతి నుంచి కేసీఆర్ గోల్కొండ కోటలో జెండాను ఎగరవేసిన అనంతరం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి వేడుకలను ప్రగతి భవన్‌కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కాగా, జిల్లా స్థాయిలో మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి ఏయే జిల్లాల్లో ఎవరు జెండాను ఆవిష్కరించేదీ పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్ పర్సన్లు, మునిసిపల్ చైర్‌పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లా స్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఉదయం 9:30 గంటలకు వీరంతా తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. అలాగే, మండల స్థాయిలో ఎంపీపీలు, గ్రామస్థాయిలో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించడంతోపాటు శానిటైజర్లు ఉపయోగించాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News