Russia: రష్యా వ్యాక్సిన్ పై వివిధ దేశాల భిన్నాభిప్రాయాలు!
- తొలి కరోనా వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన రష్యా
- క్లినికల్ ట్రయల్స్ వివరాలు తెలియదంటున్న పలు దేశాలు
- ఆచితూచి స్పందిస్తున్న ప్రపంచ దేశాలు
తాము కరోనాను అడ్డుకునే వ్యాక్సిన్ ను తయారు చేశామని రష్యా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా సహా దాదాపు 20 దేశాలు తమ వ్యాక్సిన్ కావాలని విజ్ఞప్తి చేశాయని కూడా ఆ దేశం ప్రకటించింది. 'స్పుత్నిక్ 5' పేరిట గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ దీన్ని సంయుక్తంగా తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి శరీరంలో కరోనాను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందన్న సంగతి తనకు తెలుసునని, అన్ని రకాల పరీక్షల తరువాతనే దీన్ని బయటకు వదులుతున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా వెల్లడించారు కూడా.
ఇక దీన్ని చైనా ప్రొటోటైప్ ఆధారంగా వెక్టార్ వ్యాక్సిన్ గా రష్యా అభివృద్ధి చేసింది. మానవ రక్త కణాల్లో ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది. కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీలను అభివృద్ధి చేస్తుంది. ఇది కనీసం రెండేళ్ల పాటు పని చేస్తుందని రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే, ఈ వ్యాక్సిన్ పై పలు దేశాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.
"ఈ వ్యాక్సిన్ ను పూర్తి స్థాయిలో పరీక్షించలేదని భావిస్తున్నాము. ఓ సురక్షితమైన ప్రొడక్ట్ ను తీసుకుని రావాలన్నది మా అభిమతం. ప్రజలకు టీకాను ఇచ్చే ముందు ఇదే అత్యంత కీలకం" అని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ వ్యాఖ్యానించారు. "ఈ వ్యాక్సిన్ ను పూర్తి స్థాయిలో పరీక్షించిన తరువాతనే, దేశంలో వాడుకకు అనుమతిస్తాం. ఒకసారి దాని ఫలితాలను పరీక్షించిన తరువాతనే రష్యాతో చర్చలు ప్రారంభమవుతాయి" అని ఇజ్రాయిల్ పేర్కొంది.
రష్యా రీసెర్చ్ సంస్థలతో చర్చిస్తున్నామని వ్యాఖ్యానించిన ఫిలిప్పైన్స్ శాస్త్రవేత్తలు, వారు వ్యాక్సిన్ తయారు చేసిన తీరును సమీక్షిస్తున్నామని, వారి క్లినికల్ డేటాలో భాగస్వాములం కావడం ద్వారా రీసెర్చ్ సమాచారాన్ని అందుకోవాలని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. "రష్యా దౌత్య కార్యాలయంలోని అధికారులను కలవాలని భావిస్తున్నాను. ఈ వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదుర్చుకోవాలన్నది మా ఆలోచన. అయితే, అంతకుముందే వ్యాక్సిన్ పనితీరును గమనిస్తాం. మా దేశపు రెగ్యులేటరీ అనుమతులు వస్తేనే వ్యాక్సిన్ ను అనుమతిస్తాం" అని బ్రెజిల్ గవర్నర్ రాటినో జూనియర్ తెలిపారు.
ఈ నెలాఖరులోగా తమ అధికారులను మాస్కోకు పంపించి, వ్యాక్సిన్ పై సమాచారాన్ని తెలుసుకుంటామని కజకిస్థాన్ వ్యాఖ్యానించింది. రష్యా ప్రకటన తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, మరింత సమాచారం కోసం వేచి చూస్తామని మెక్సికో డిప్యూటీ హెల్త్ మినిస్టర్ హుగో లోపేజ్ గాటెల్ వ్యాఖ్యానించారు. ఓ వ్యాక్సిన్ ను అనుమతించాలంటే, ఎన్నో రకాల పరీక్షలు, సమీక్షల తరువాతే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించిన డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి తారిక్ జసరేవిక్, రష్యా జరిపిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.