Donald Trump: జో బిడెన్ దూకుడు... కమలా హారిస్ తో కలిసి తొలి ప్రచారం!
- అమెరికాను ట్రంప్ విఫలం చేశారు
- నిరుద్యోగం, రోగాలు పెరిగిపోయాయి
- హారిస్ తో కలిసి బిడెన్ ప్రసంగం
- వెంటనే తీవ్రంగా స్పందించిన ట్రంప్
ఈ సంవత్సరం నవంబర్ లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ ను పదవీచ్యుతుడిని చేయాలన్నదే లక్ష్యంగా నిన్న వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థినిగా కమలా హారిస్ పేరును ప్రకటించిన డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్, ఆ వెంటనే ఆమెతో కలిసి వాషింగ్టన్ లో ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. తన ప్రచారంలో విభిన్నమైన అమెరికాను తెరపైకి తెస్తున్నారు. ట్రంప్ అసమర్థతను ప్రస్తావిస్తూ, వివిధ అంశాల్లో ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, బిడెన్ టీమ్ కు అస్త్రాలుగా మారాయి. క్లయిమెట్ చేంజ్ పై ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం, ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను కూడా వీరు ప్రస్తావిస్తున్నారు.
వీటన్నింటికీ మించి, కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని కమలా హారిస్ తన తొలి ప్రచార ప్రసంగంలో నిప్పులు చెరిగారు. ట్రంప్ అసమర్థత, దేశం రోగాల పాలవడం, మరణాలు సంభవించడం, నిరుద్యోగం పెరిగిపోవడంపై ఆమె మండిపడ్డారు. ట్రంప్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని కమలా హారిస్ ఆరోపించారు. జాతి యావత్తూ ఇప్పుడు నాయకత్వ లేమిలో కూరుకుపోయిందని, ఎన్నుకున్న ప్రజలను పక్కనబెట్టి, తన కోసం తాను పని చేస్తున్న అధ్యక్షుడు దొరకడం దురదృష్టకరమని ఆమె అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం నానాటికీ క్లిష్టతరమవుతోందని విమర్శలు గుప్పించారు.
కాగా, వీరిద్దరి ప్రచార సభ ముగిసిన రెండు గంటల్లోనే ట్రంప్ స్పందించారు. వైట్ హౌస్ మీడియా సమావేశంలో కమలా హారిస్ ఓ పిచ్చిదని అభివర్ణించారు. గతంలో జో బిడెన్ ను కమలా హారిస్ అవమానపరిచినంతగా మరెవరూ అవమానించలేదని, అతని గురించి ఎన్నో భయంకర విషయాలను ఆమె పంచుకుందని అన్నారు. ఇప్పుడు అవన్నీ మరచిపోయి, ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఆయన్ను అద్భుతమైన వ్యక్తిగా పొగడ్తలు కురిపిస్తోందని నిప్పులు చెరిగారు.