VH: నీ చరిత్ర బయటికి తీస్తా బిడ్డా, అమ్మతోడు!: రేవంత్ రెడ్డికి వీహెచ్ వార్నింగ్
- బయటి నుంచి పార్టీలోకి వచ్చారంటూ విమర్శలు
- కాబోయే సీఎంలంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం
- పార్టీ నష్టపోతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టీకరణ
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బయటి నుంచి వచ్చి పార్టీలో చేరిన వాళ్లు పార్టీ అధినాయకత్వంపైనే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
'సోనియా వయసైపోయింది, రాహుల్ గాంధీ పార్టీని పట్టించుకోవడం లేదు అంటూ ప్రచారం చేస్తున్నారు, ఏంటి ఈ ధోరణి?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డిలను ఏనాడు కాంగ్రెస్ పార్టీ కాబోయే ముఖ్యమంత్రులు అంటూ ముందే చెప్పలేదని, కానీ ఇప్పుడు కొందరు కాబోయే ముఖ్యమంత్రులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
"జనాభాలో మీ పర్సంటేజీ ఎంత? మేం 85 పర్సంటేజీ ఉన్నాంరా భై! మీరు ఇవాళ దాదాగిరీ చేస్తుంటే మేం ఊరుకోవాలా! పార్టీలోకి వచ్చావు కాబట్టి కొన్నిరోజులు పనిచేసుకో... లేకపోతే నేను చరిత్ర బయటికి తీయాల్సి ఉంటుంది బిడ్డా! అమ్మతోడు చెబుతున్నా! పార్టీ నష్టపోతుంటే ఇక ఓపిక వహించలేం. సొంత నియోజకవర్గంలో ఒక్క మున్సిపాలిటీ గెలవలేదు కానీ పెద్ద నాయకుడంట! నువ్వు పెద్ద హీరోవా?" అంటూ నిప్పులు చెరిగారు.