Rapaka Vara Prasad: జనసేన గాలికి వెళ్లిపోయే పార్టీ అని, గాలి పార్టీ అని ఎక్కడా అనలేదు: రాపాక వివరణ

Rapaka Varaprasad clarifies on alleged rumors

  • తనపై దుష్ప్రచారం జరుగుతోందన్న రాపాక
  • కొందరు వక్రీకరిస్తున్నారని ఆరోపణ
  • చివరి నిమిషం వరకు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించినట్టు వెల్లడి

గత ఎన్నికల్లో జనసేన పార్టీ రాజోలు అసెంబ్లీ స్థానంలో తప్ప మరెక్కడా విజయం సాధించలేదు. రాపాక వరప్రసాద్ రూపంలో ఆ పార్టీకి అసెంబ్లీలో ఓ ప్రతినిధి లభించాడు. కానీ, వరప్రసాద్ సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యేనే అయినా, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జనసేన హైకమాండ్ తో ఆయన సఖ్యత అంతంతమాత్రమే! ఈ నేపథ్యంలో రాపాక జనసేన ఓ గాలి పార్టీ అన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు.

జనసేన గాలికి వెళ్లిపోయే పార్టీ అని గానీ, గాలి పార్టీ అని గానీ ఎక్కడా అనలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కొందరు కావాలనే వక్రీకరించి వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. తనను జనసేన నుంచి సస్పెండ్ చేసినట్టు ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయని వెల్లడించారు.

అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటేనే పనులు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు చివరి నిమిషం వరకు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించానని, కానీ బొంతు రాజేశ్వరరావు వల్ల తనకు టికెట్ దూరమైందని రాపాక వెల్లడించారు. తాను కేవలం జనసైనికుల వల్లే గెలవలేదని, జనసైనికుల ప్రభావం ఉండుంటే రాష్ట్రం మొత్తం జనసేన గెలిచుండేదని సూత్రీకరించారు. తనకు జనసైనికులతో పాటు మిగతా వాళ్లు కూడా ఓట్లు వేశారని, వారికి కూడా తాను సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అభివృద్ధి పనుల కోసం వైసీపీ వెంట నడవక తప్పదని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News