Ashok Gehlot: సంక్షోభానికి ముగింపు పలికిన అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్... కెమెరాలకు నవ్వుతూ పోజులు!
- దాదాపుగా ముగిసిన రాజస్థాన్ రాజకీయ సంక్షోభం
- గెహ్లాట్ నివాసంలో సచిన్ పైలట్ సందడి
- రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు
- ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేత
రాజస్థాన్ లో తీవ్ర రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలెట్ ఇవాళ సీఎం అశోక్ గెహ్లాట్ ను కలిశారు. రాజస్థాన్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే ప్రథమం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొనేందుకు తన ఇంటికి రావాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి సచిన్ పైలట్ కు ఆహ్వానం అందింది.
అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ లో చేసిన పోస్టు కూడా సుహృద్భావ వైఖరికి దర్పణం పట్టింది. మర్చిపోదాం, క్షమించుదాం... ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు చేయి కలుపుదాం అంటూ ఆయన చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించిందో చెప్పనక్కర్లేదు. ఇక, ఇరువురి భేటీ విషయానికొస్తే, కరోనా ప్రభావం నేపథ్యంలో మాస్కులతో హాజరయ్యారు. అనేక అంశాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ, కరచాలనం చేస్తూ, చిరునవ్వులతో ఫొటోలకు పోజులిచ్చారు. రేపటినుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
అటు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించగా, బలం నిరూపించుకుంటామని సీఎం గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, రేపటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను పార్టీ ఎత్తివేసింది. నెలరోజులకు పైగా సాగిన ఈ రాజకీయ సంక్షోభం సమసిపోవడంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కీలకపాత్ర పోషించారు. ఆయన కూడా ఇవాళ్టి సమావేశంలో ఎంతో హుషారుగా కనిపించారు.